అమ్మ జీతం ఎంత? (Eenadu Magazine 13/05/2012)






అమ్మ జీతం ఎంత?
నిజమే...ఎంత? ఇరవై నాలుగు గంటల ఉద్యోగం. వారాంతాలు లేవు. పండగ సెలవుల్లేవు. ప్రమోషన్లు లేవు. ఇంక్రిమెంట్లు లేవు. రిటైర్మెంటు కూడా లేదు. ఆ శ్రమను కొలిస్తే? స్వేద బిందువులను లెక్కగడితే? ...'మాతృదినోత్సవం' సందర్భంగా అమ్మకు అంకెల పూదండ!
వంట చేస్తే అమ్మే చేయాలి. సృష్టికర్త, అమ్మ వేలి చివర్లలో అమృత బిందువులు పూసుంటాడు. ఆమె వండిన పాయసం ఎంత రుచిగా ఉంటుందో, ఆ చేతులతో కలిపిన చద్దన్నం ముద్దలు కూడా అంతే కమ్మగా ఉంటాయి. షెఫ్‌లకూ చీఫ్‌-షెఫ్‌లకూ అమ్మ దగ్గర శిక్షణ ఇప్పించాలి.ఇల్లు సర్దితే అమ్మే సర్దాలి. ఇంటీరియర్‌ డిజైనర్లు కూడా ఆమె ముందు దిగదుడుపే. ఏ వస్తువును ఎక్కడ పెట్టాలో అమ్మకు బాగా తెలుసు. ఏ రంగు గోడలకు ఏ రంగు కర్టెన్లు నప్పుతాయో ఇట్టే చెప్పేయగలదు. గృహాలంకరణ శాస్త్రాన్ని ఎప్పుడు అధ్యయనం చేసిందో మరి!
అమ్మ ఓదార్చితే ఎంత పెద్ద కష్టమైనా గాలికెగిరిపోతుంది. అమ్మ ధైర్యం చెబితే, కొండల్ని పిండిచేయగల శక్తి వచ్చేస్తుంది. స్టీఫెన్‌ కోవేలూ రాబిన్‌శర్మలూ ఆమె కాలి గోటికి కూడా సరిరారు. మనకు తెలియకుండా, ఎంత వ్యక్తిత్వ వికాస సాహిత్యం చదివిందో!
ఒకటని ఏమిటి? బట్టలుతికినా, ఇల్లు దులిపినా, కళ్లాపి చల్లినా, ముగ్గువేసినా, అంట్లుతోమినా, వడియాలు పెట్టినా, షాపింగ్‌ చేసినా, కూరగాయలు బేరమాడినా, కొట్లో బట్టలు ఎంపిక చేసినా, ఆడపిల్లకు జడవేసినా, మగపిల్లాడికి క్రాపు దువ్వినా, శ్రీవారి జుత్తుకు రంగు వేసినా, అత్తగారికి అమృతాంజనం రాసినా, మామగారికి భాగవతం చదివి వినిపించినా...ఏ పనైనా సర్వసమర్ధంగా, మహానైపుణ్యంగా, పరమ పరిపూర్ణంగా చేయగలదు అమ్మ.
మెచ్చుకోళ్లూ ప్రశంసలూ తర్వాత.
ఇంత శ్రమ, ఇంత నైపుణ్యం, ఇంత సమర్ధత...ఏ రికార్డులకూ ఎక్కడం లేదు. అదీ అమ్మ ఉద్యోగిని కూడా అయితే, ఆ సంపాదన మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు. ఆదాయపన్ను లెక్కల ప్రకారం...మాతృమూర్తి హోదాలో అమ్మ జీతం సున్నానే! మానవ వనరుల జాబితాలో అమ్మతనం అసలు నైపుణ్యమే కాదు.
ఎంత అన్యాయం! ఎంత వివక్ష!
నయాపైసాతో సహా...అమ్మకు రావాల్సిన జీతమెంతో ఇప్పుడే తేల్చేద్దాం! ఆ జీతం కూడా దేశంలోని అత్యుత్తమ నిపుణులతో సమానంగా ఉండాలి. అలా అని, ఇదంతా మాతృమూర్తికి ఖరీదు కట్టే షరాబుగిరీ కాదు. ప్రేమపూర్వక ప్రయత్నం.
'కోహినూర్‌ వజ్రం అపురూపమైంది' అని వందసార్లు చెప్పినా, చాలామందికి ఆ గొప్పదనం అర్థంకాదు. 'కోహినూర్‌ వజ్రం ఖరీదు... వేయికోట్లు!' అంటే ఠక్కున వెలుగుతుంది. 'ఆహా!' అని ఆశ్చర్యపోతారు. 'నిజమా...' అని కళ్లు నులుపుకుంటారు. ఆ ధగధగల్ని ఆరాధనగా చూస్తారు.
కొన్నిసార్లు, వెలకట్టడం వల్ల విలువ తెలుస్తుంది! గౌరవం పెరుగుతుంది!!
పది రూపాయల చాక్లెట్‌ అయినా...
వంద రూపాయల చాక్లెట్‌ అయినా...
రుచిలో పెద్దగా తేడా ఉండదు. కానీ, 'నీ కోసం వంద రూపాయల చాక్లెట్‌ తెచ్చాన్రోయ్‌'...అని చెప్పినప్పుడు పిల్లాడి కళ్లలో కనిపించే ఆనందమే వేరు! డబ్బే కొలమానమైన సమాజంలో ఉన్నాం మనం. మాటలురాని పసివాడికి కూడా కరెన్సీ విలువ తెలిసినప్పుడు, పెద్దల సంగతి చెప్పేదేముంది!
అమ్మ శ్రమను అక్షరాల్లో కంటే, అంకెల్లో చెబితేనే మన లెక్కల బుర్రలకెక్కుతుంది. మాతృమూర్తి హోదాలో అమ్మ జీతమెంతో లెక్కించడం వెనకున్న సదుద్దేశమూ అదే. ఈ అంకెలు కూడా ఉజ్జాయింపే! స్కేలు పట్టుకుని హిమవత్పర్వతాన్ని కొలవడమే! లీటరు గిన్నెతో పాలసముద్రాన్ని తోడేయడమే!
ఈ కథనం లక్ష్యం ఒకటే...
అమ్మ శ్రమకు గుర్తింపు కావాలి, రావాలి!
అమ్మలందరికీ...
మాతృదినోత్సవ పాదాభివందనాలు!
 
నవమాసాల శ్రమ
రూ.25,00,000/-
(ఏకమొత్తంగా)
మ్మ ప్రాణాలన్నీ కడుపులోని కసుగాయ మీదే! ఆ తొమ్మిది నెలలూ తనకంటూ ఇష్టాలుండవు. ఉన్నా, వదిలేసుకుంటుంది. బిడ్డకు ఏం అవసరమో అదే తింటుంది. బిడ్డకు ఏం క్షేమమో అదే చేస్తుంది. చుట్టూ శత్రుదుర్భేద్యమైన కోట కట్టినట్టు, పొట్ట మీద ఎప్పుడూ రెండు చేతులు. నాన్నలా కోటేరు ముక్కో, అమ్మలా సంపెంగ నాసికమో. అబ్బాయి అయితే... నీలమేఘ శ్యాముడో, బంగారు వన్నెవాడో! అమ్మాయే అయితే నల్లకలువో, మల్లెపూవో! - నిద్రలోనూ పసిగుడ్డు ధ్యాసే! లోలోపల కదిలిన సవ్వడి చాలు..మురిసిమురిసిపోతుంది. మెత్తని పాదాల తాకిడికి..తనువంతా పులకింత.తొమ్మిది నెలలు మోసి, ఒక జీవికి ప్రాణం పోయడమంటే మామూలు కష్టం కాదు. శారీరక సమస్యలు ఇబ్బంది పెడతాయి. హార్మోన్ల తేడాలు పరీక్షలు పెడతాయి. ఎన్ని ఆసుపత్రులు వచ్చినా, ఎంతమంది నిపుణులున్నా ప్రసవమంటే ఇప్పటికీ పెద్దగండమే. అంతా సవ్యంగానే జరిగిందనుకున్నా, కోలుకోడానికీ మళ్లీ మామూలు మనిషి కావడానికీ ఏడాదైనా పడుతుంది. అంటే, దాదాపు రెండేళ్ల శ్రమ. అన్నీ తెలిసీ కూడా ఆ బాధ్యతను సంతోషంగా స్వీకరిస్తుందా తల్లి!
నవమాసాలు కంటికి రెప్పలా కాపాడినందుకు, క్షేమంగా భూమి మీదికి తెచ్చినందుకు...అమ్మకివ్వాల్సిన పారితోషికాన్ని ఎంతని లెక్కగట్టాలి? ఓ శిశువుకు జన్మనివ్వడాన్ని సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌తో పోల్చుకోవచ్చా? రెండేళ్ల ప్రాజెక్టుకు ఓ ఐటీ నిపుణుడు ఎంత వసూలు చేస్తాడో అంతా చెల్లిస్తే సరిపోతుందా?
సరిపోకపోవచ్చు, సరిపెట్టుకోవచ్చు.
ఆకలితీర్చే అన్నపూర్ణమ్మ
నెలకు
రూ.1,00,000
బిడ్డకు ఎప్పుడు ఆకలేస్తుందో అమ్మకు తెలుసు. బంగారు గిన్నెలో బువ్వ తినిపించినట్టు...కొంగు చాటుగా స్తన్యాన్ని అందిస్తుంది. బిడ్డకెప్పుడు బొజ్జ నిండుతుందో కూడా అమ్మకే తెలుసు. పసివాడు ఆబగా కుడుస్తున్నా...ముద్దుగా విసుక్కుని, మూతి తుడిచేస్తుంది. అన్నప్రాశన నాటి పాయసాన్నంతో మొదలు - పప్పన్నం, చారన్నం, కూరన్నం పాలన్నం, పెరుగన్నం మెత్తమెత్తగా కలిపి ముద్దలు చేసి తినిపిస్తుంది. రుచి అంటే ఏమిటో చెబుతుంది. ఎలా భోంచేయాలో నేర్పుతుంది. వండుతున్నప్పుడూ బోలెడంత శ్రద్ధ! పసివాడు కారం తినలేడు, చిన్నారికి చిటికెడు ఉప్పు ఎక్కువైనా సయించదు, బాబుకు పప్పుచారంటే ఇష్టం, పాపకు రోటిపచ్చడంటే ప్రాణం...కొసరికొసరి వడ్డించేది అన్నమో పప్పో పాయసమో కాదు - అమ్మ మనసు!కాఫీలూ టీలూ హార్లిక్సులూ బోర్నవిటాలూ. పొద్దున బ్రేక్‌ఫాస్ట్‌, మధ్యాహ్న భోజనం, సాయంత్రానికి చిరుతిళ్లు, రాత్రికి మళ్లీ భోజనం, ఆదివారాలు స్పెషల్‌, పండగలూ పబ్బాలకు పిండివంటలు. అందరి ఇష్టాయిష్టాలూ గుర్తుంచుకుని మరీ వండిపెట్టాలి. అంత గొప్పగా వండే షెఫ్‌లకు, స్టార్‌ హోటళ్లలో అయితే లక్షణంగా లక్ష రూపాయల జీతమిస్తారు.
పనే ప్రాణమైన మనిషి
నెలకు
రూ.10,000/-
గోడ గడియారానికి ఎప్పుడైనా ఎన్ని గంటలు కొట్టాలనే సందేహం వస్తే, అమ్మ వైపే చూస్తుంది. తెల్లారకముందే అమ్మ దినచర్య మొదలవుతుంది. ఆరింటికి ముగ్గు పెట్టడం. ఆరున్నరకల్లా ఇల్లు తుడవడం. పదింటి దాకా వంటపని. పదకొండింటికి, పనిపిల్ల ఉతికేసిన బట్టల్ని ఇస్త్రీమడతలతో బీరువాలో సర్దడం. పనమ్మాయి ఆదరాబాదరాగా పిండేసిందేమో అన్న అనుమానం వస్తే, మళ్లీ శుభ్రంగా ఉతకడం. మధ్యాహ్నం కాసేపు కునుకుతీశాక ... బూజు దులపడం, పుస్తకాల అరలు సర్దడం. షోకేస్‌లోని బొమ్మల్ని తుడిచిపెట్టడం, బాత్‌రూమ్‌ మురికిపట్టినట్టు అనిపిస్తే శుభ్రంగా కడగడం, చిందరవందరగా పడున్న న్యూస్‌పేపర్లను చక్కగా పేర్చడం, కుండీల్లోని మొక్కలకు నీళ్లు పోయడం, మాసిపోయిన కర్టెన్లు మార్చడం, పక్కబట్టలు సర్దడం, సరుకుల జాబితా రాసి కొట్టువాడికి ఇచ్చిరావడం, పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్‌కు అవసరమైన ఇడ్లీపిండి మిక్సీలో వేసుకోవడం - నిద్రపోతున్నప్పుడు తప్పించి అమ్మ ఎప్పుడూ ఖాళీగా ఉండదు. నిద్రలో కూడా ఇంటి పనుల గురించే ఆలోచిస్తుందేమో! అయినా మొహంలో కొంచెం కూడా అలసట కనిపించదు. ఇంకేదైనా పని చేసిపెట్టమని అడిగినా విసుక్కోదు. సరిగా చేయలేదంటే చిన్నబుచ్చుకోదు. ప్రశంసించకపోతే బాధపడదు. కార్మిక చట్టాల ప్రకారం ఏ ఉద్యోగితో అయినా, ఎనిమిది గంటలకు మించి పనిచేయించుకోడానికి వీల్లేదు. ఎప్పుడైనా చేయించినా, అదనపు భత్యం ఇవ్వాలి. ఆదివారాలు సెలవు లేదు. పండగ పబ్బాలకు రెట్టింపు చాకిరీ. ఇదంతా లెక్కేసుకుంటే, అమ్మ ఒక్కతే నలుగురు మనుషుల పని చేస్తుందేమో అనిపిస్తుంది. అనిపించడం ఏమిటి, నిజం కూడా!
చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌
నెలకు
రూ.1,00,000
ల్లే ఓ కార్పొరేట్‌ కంపెనీ అనుకుంటే... నాన్న ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టరు. పిల్లలు బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లు. అమ్మ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌. డైనింగ్‌ టేబుల్‌ సమావేశంలో...ఇంటికి సంబంధించిన కీలక ప్రతిపాదనలేమైనా ఉంటే చర్చకు పెడుతుంది. ఆ తీర్మానాలు అమలయ్యేలా చూస్తుంది. నెలవారీ బడ్జెట్‌ ఆమోదించుకుంటుంది. కూరగాయలు, పాలు, బియ్యం, టెలిఫోన్‌ బిల్లు, కరెంటు బిల్లు...దేనికెంతో కేటాయిస్తుంది. ఆదాయ వ్యయాల మీద ఓ కన్నేసి ఉంచుతుంది. ఎక్కడ దుబారా జరుగుతుందో కనిపెడుతుంది. ఎక్కడ అదనపు నిధులు అవసరమో గుర్తిస్తుంది. ఎంతోకొంత మిగులు ఉండేలా చూస్తుంది. ఆ మొత్తాన్ని పొదుపు ఖాతాలోకి మళ్లిస్తుంది.కుటుంబ సభ్యుల్లో ఎవరైనా దారితప్పుతున్నట్టు అనుమానం వస్తే... మెత్తగా చివాట్లేస్తుంది. ఎవరి విషయంలో ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలో, ఎలా దారికి తెచ్చుకోవాలో అమ్మకు బాగా తెలుసు. కొన్నిసార్లు కంటిచూపుతో హెచ్చరిస్తుంది. ఇంకొన్నిసార్లు మౌనంగానే కొరడా ఝళిపిస్తుంది. అమెది ధర్మాగ్రహం! ఆడపడుచులకు ఘనంగా చీరసారెలు పెడుతుంది. అతిథులకు ఏ లోటూ రాకుండా చూసుకుంటుంది. ఇరుగుపొరుగువారికి తల్లో నాలుకలా వ్యవహరిస్తుంది. ఒకటేమిటి, సమాజంలో బంధువర్గంలో తన కుటుంబానికి ఓ ప్రత్యేకమైన గుర్తింపునూ గౌరవాన్నీ తీసుకురావడానికి అవసరమైన 'బ్రాండింగ్‌' కార్యక్రమాలన్నీ చేపడుతుంది.
పేరుకు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసరే అయినా...చీఫ్‌ ఫైనాన్స్‌ ఆఫీసర్‌, చీఫ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌, చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ వగైరా బాధ్యతలు కూడా అమ్మే నిర్వహిస్తుంది. ఆ లెక్కన, దేశంలోని అత్యుత్తమ కంపెనీలలో అత్యున్నత నిపుణులకు ఇచ్చే జీతాన్నే అమ్మకూ ఇవ్వాల్సి ఉంటుంది.
వ్యక్తిత్వ వికాస నిపుణురాలు
నెలకు రూ.5000/-
మ్మలో వ్యక్తిత్వవికాస గురువునూ చూస్తాం. జీవితం గురించీ లక్ష్యం గురించీ ఏదో ఒక సందర్భంలో చెబుతూనే ఉంటుంది. బాగా చదువుకుని ఉన్నత స్థానాలకు వెళ్లినవారి విజయగాథలు వినిపిస్తూనే ఉంటుంది. అమ్మ మంచి 'మోటివేటర్‌'. ఓ పరీక్షలో ఐదోపదో మార్కులు తక్కువొచ్చాయని చిన్నబోయి కూర్చున్నప్పుడు, 'ఎందుకు చిన్నా అంత బాధపడతావ్‌! వచ్చే పరీక్షల్లో నూటికి నూరు తెచ్చుకుందువు గాని' అని ధైర్యం చెబుతుంది. ఇంటర్వ్యూలో సరిగా సమాధానం చెప్పలేదని మనసులోనే కుమిలిపోతుంటే, 'వెధవ ఉద్యోగం! ఇది కాకపోతే ఇంకోటి' అని బోలెడంత భరోసా ఇస్తుంది. ఆ మాటలు మంత్రమేసినట్టే ఉంటాయి. ఆ నిమిషానికి అమ్మను రాబిన్‌శర్మలూ శివ్‌ఖేరాలూ ఆవహిస్తారేమో. చెడు చెవిలో చెప్పాలి, మంచి మందిలో చెప్పాలంటారు. ఆ విషయంలో అమ్మ తర్వాతే ఎవరైనా. బిడ్డలోని లోపాల్నీ బలహీనతల్నీ గుండెల్లోనే దాచుకుంటుంది. ఏ కొంత మంచి ఉన్నా, సగర్వంగా నలుగురికీ చాటుతుంది. నాన్నకు పుత్రోత్సాహం...బిడ్డ పుట్టినప్పుడు కలుగుతుంది. అమ్మ మాత్రం, ఆ బిడ్డ ఎదిగి గొప్పవాడైనప్పుడే సంతోషిస్తుంది.కాస్తోకూస్తో పేరున్న ఏ వ్యక్తిత్వవికాస నిపుణుడి శిబిరానికి హాజరు కావాలన్నా రోజుకు పదివేల రూపాయలు సమర్పించుకోవాలి. సాక్షాత్తు నిపుణురాలే మనింట్లో ఉండి, వేలు పట్టుకుని నడిపిస్తోందంటే...ఎంత ఫీజు చెల్లించాలో ఆలోచించండి.
చదువులమ్మ
నెలకు
రూ.5,000/-
బిడ్డ అక్షరాభ్యాసం నాటికే అమ్మ టీచరమ్మగా మారిపోతుంది. చేతవెన్నముద్దలూ ట్వింకిల్‌ట్వింకిల్‌ లిటిల్‌స్టార్లూ, అఆఇఈ నుంచి ఎక్స్‌వైజెడ్‌ వరకూ, జనవరి ఫిబ్రవరితో మొదలుపెట్టి మాఘం, ఫాల్గుణం దాకా - చెప్పాల్సిన పాఠాలన్నీ చెప్పేస్తుంది. పాపో బాబో బడికెళ్లడం మొదలుపెట్టాక, ట్యూషన్‌టీచరు అవతారం ఎత్తుతుంది. చక్కగా హోంవర్కు చేయిస్తుంది. చేతిరాత మెరుగు పరుస్తుంది. సందేహాలుంటే తీరుస్తుంది. అవసరమైతే, పిల్లలతో కాన్వెంట్‌ భాషలో మాట్లాడ్డానికి స్పోకెన్‌ ఇంగ్లిష్‌ పాఠాలూ నేర్చుకుంటుంది. బిడ్డలు ఎదుగుతున్నకొద్దీ అమ్మ బాధ్యతలూ ఎక్కువవుతాయి. వాళ్లు పెద్ద పరీక్షలకు సిద్ధమవుతుంటే, తనూ ఓ పుస్తకం పట్టుకుని తోడుగా కూర్చుంటుంది. మధ్యమధ్యలో పాలో తేనీరో ఇస్తూ అలసట పోగొడుతుంది. ఏ అర్ధరాత్రో చదువుతూ చదువుతూ నిద్రలోకి జారుకుంటే... పుస్తకాలు సర్దేసి, దుప్పటి కప్పి, ట్యూబ్‌లైటు ఆర్పేస్తుంది. తెల్లవారుజామున అలారమ్‌ మోతకు ఓ పావుగంట ముందే మేల్కొని, పరీక్షకెళ్తున్న బిడ్డకు అన్నీ సిద్ధం చేస్తుంది.ఐన్‌స్టీన్‌కైనా తొలి బడి...అమ్మ ఒడే!
అమ్మ ఉన్నత విద్యావంతురాలు కావచ్చు, కాకపోవచ్చు. కానీ బిడ్డకు అర్థమయ్యేలా చెప్పాలన్న తపనే ... పట్టాలకు అతీతమైన పరిణతిని ఇస్తుంది. అందుకేనేమో, అమ్మ చెప్పిన పాఠాలు అంతగా గుర్తుండిపోతాయి. అమ్మలోని టీచరమ్మకు ఎంత ఫీజు ఇవ్వాలి?
మా మంచి రాయబారి
రూ. 1,00,000/- (ఏకమొత్తంగా)
'నాన్నగారితో నేను మాట్లాడతాగా'... అమ్మ హామీ ఇచ్చిందంటే, నిశ్చింతగా నిద్రపోవచ్చు. సగం పని అయిపోయినట్టే. అదేం చిత్రమో, 'కాలేజీ బస్సు టైమ్‌కు రావడం లేదు. బైక్‌ కొనిపెట్టండి డాడీ!..' అన్న మాట పూర్తికాకముందే కయ్యిమని ఎగిరిపడే నాన్నగారు, సాయంత్రానికల్లా శాంతమూర్తి అయిపోతారు. 'ఏ బండి తీసుకుందాం? ఎంతవుతుందేమిటి?' అంటూ పరోక్షంగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేస్తారు. అంతా అమ్మ చర్చల మహిమ! కంప్యూటర్‌ కొందామని ప్రతిపాదన పెడితే... 'వీధి నిండా ఇంటర్నెట్‌ సెంటర్లున్నాయిగా!' అన్న సాకుతో రెండేళ్ల నుంచీ వాయిదా వేస్తూ వస్తున్న బడ్జెట్‌ పద్మనాభం, అమ్మ 'మాట్లాడగానే...' క్రెడిట్‌కార్డు చేతిలో పెట్టి, 'కాస్త ధర ఎక్కువైనా ఫర్వాలేదు...మంచిదే కొను' అంటూ ఉదారంగా వ్యవహరిస్తారు. ఇంజినీరింగ్‌ తప్ప మరో చదువు చదివించనని మొండికేసిన పెద్దమనిషి, అమ్మ రాయబారం తర్వాత 'సరే నీ ఇష్టం! నీకు నచ్చిన కోర్సులోనే చేరు. మంచి మార్కులతో పాసై మన ఇంటి పేరు నిలబెట్టాలి' అని ఉపన్యాసం ఇచ్చేస్తారు. పెళ్లి విషయంలోనూ అంతే. నాన్న ఎప్పుడూ...ఆస్తిపాస్తులూ గౌరవమర్యాదలూ చూస్తారు. అమ్మ మాత్రం ఈడూజోడూ చూస్తుంది. పిల్లల మనసులో ఏముందో తెలుసుకుంటుంది. బిడ్డల కోసం తన ఇష్టాయిష్టాల్ని వదులుకుంటుంది. అందర్నీ ఒప్పించి సంబంధం ఖాయం చేసేస్తుంది. ఏమాటకామాటే చెప్పుకోవాలి, అమ్మ సమర్ధ మధ్యవర్తి. నొప్పించక ఒప్పించగల రాయబారి. మంచిచెడులు బేరీజువేయగల విశ్లేషకురాలు. బేరసారాల్లో దిట్ట. కొత్తిమీర కట్ట నుంచి వజ్రాలహారం దాకా... ఏదైనా సరే, మహా గడుసుగా బేరం చేస్తుంది! ఎదురుగా ఉన్న వస్తువును ఎంత కచ్చితంగా వెలకట్టగలదో, ముందున్న మనిషి బుర్రనూ అంతే కచ్చితంగా చదివేయగలదు. ఎప్పుడు పట్టుదలగా వ్యవహరించాలో, ఎప్పుడు పట్టువిడుపులు ప్రదర్శించాలో అమ్మకు బాగా తెలుసు. తనను కనుక భారత రాయబారిగా పాకిస్థాన్‌కు పంపితే...నెల తిరిగేసరికి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. అనుమానాలూ అపోహలూ తొలగిపోతాయి. ఇలాంటి అర్హతలున్న లాబీయిస్టుల కోసమే కార్పొరేట్‌ ప్రపంచం అంజనమేసి గాలిస్తోంది. ఎంత జీతమైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.మూడుచక్రాల సైకిలు నుంచి బ్రాండ్‌న్యూ బైక్‌ దాకా, ఇష్టమైన చదువుల నుంచి ఇష్టపడే అమ్మాయితో పెళ్లి దాకా...వివిధ సందర్భాల్లో అమ్మ నెరిపిన మధ్యవర్తిత్వానికి ఎంత ఫీజు చెల్లించాలో నిర్ణయించుకోండి. లక్షో పదిలక్షలో...మీరే లెక్కేసుకోండి.
అమ్మమ్మగా, నానమ్మగా..
నెలకు
రూ.30,000/-
పిల్లలు ఉద్యోగాల్లో వ్యాపారాల్లో స్థిరపడతారు. పెళ్లిళ్లు అయిపోతాయి. భర్త రిటైర్‌ అవుతారు. ఉద్యోగిని అయితే, తనూ పదవీవిరమణ చేస్తుంది. అయినా అమ్మ బాధ్యతలకు మాత్రం రిటైర్మెంట్‌ ఉండదు. అమ్మమ్మగా, నానమ్మగా మనవళ్లూ మనవరాళ్ల సంరక్షణ బాధ్యతా తనే తీసుకుంటుంది. 'ఇద్దరూ ఆఫీసులకు వెళ్తారాయె! వేళాపాళాలేని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు. నేను కాకపోతే ఇంకెవరు చూస్తారు?' అనుకుంటుంది. లాలపోయడం జోలపాడటం, గోరుముద్దలు కమ్మని ముద్దులు... అమ్మతనంలో ఇది రెండో అధ్యాయం! వయసుతోపాటు వచ్చే ఆరోగ్య సమస్యల్నీ వార్ధక్యపు పరిమితుల్నీ తట్టుకుంటూనే... ఏ లోటూ రాకుండా చూసుకుంటుంది. 'మమ్మీ' ఆఫీసు నుంచి వచ్చేదాకా... తానే కన్నతల్లి అవుతుంది. వేలకు వేలుపోసి ఏ ఖరీదైన క్రెష్‌లో చేర్పించినా, ఆ సంరక్షణ లభించదు. ఏ ఆయమ్మా అమ్మ కాలేదు.అమ్మమ్మలా, నానమ్మలా తమ పిల్లల బాగోగులు చూసుకునే భారతీయ మాతృమూర్తుల కోసం అమెరికాలోని ప్రవాసులు దినపత్రికల్లో ప్రకటనల మీద ప్రకటనలు ఇస్తున్నారు. వసతి, భోజనంతోపాటు నెలకు పాతిక, ముప్ఫై వేల దాకా జీతం ఇస్తామని చెబుతున్నారు. నిజంగా వెళ్లాలనుకుంటే, డాలర్లదేశంలోనూ అమ్మకు బోలెడన్ని ఉద్యోగావకాశాలు.
మొత్తం లెక్క తేలిస్తే...అమ్మ సంపాదన పెద్దపెద్ద కంపెనీల ఉన్నతోద్యోగుల జీతంకంటే ఒక రూపాయి ఎక్కువే. అటూ ఇటుగా శిఖాశర్మ, చందా కొచ్చర్‌లతో అమ్మ పోటీపడుతుంది.చెక్కు మీద 'అమ్మ' పేరు రాసి, అంకెలేసి, సంతకం చేసినంత మాత్రాన బాధ్యత తీరిపోయినట్టు కాదు.
మరో చెల్లింపు మిగిలే ఉంది... బోనస్‌!
వండిపెట్టినందుకు జీతం ఇస్తాం...మరి, 'ప్రేమతో' వండిపెట్టినందుకు? కన్నందుకు పారితోషికం ఇస్తాం? మరి, రక్తం పంచుకున్నందుకూ, పేగు తెంచుకున్నందుకూ? పాఠం చెప్పినందుకు ట్యూషన్‌ ఫీజు ముట్టజెపుతాం? మరి, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దినందుకు చెల్లించాల్సిన గురుదక్షిణ మాటేమిటి?
అంతా వెలకడితే... మొత్తం బోనస్‌ -
రూ.10000000000000000000000000000000
(అక్షరాలా...అనంతం)
అనంతాన్ని కొలవగల మేధావులే అయినా, అపారమైన మొత్తాన్ని చెల్లించగల కుబేరులే అయినా...అంతటితోనూ అమ్మరుణం తీరిపోదు. వేయిరెట్లు పెరుగుతుంది.
ఎందుకంటే... ఆ మేధస్సు వెనుక అమ్మ జన్యువులున్నాయి!
ఆ సిరిసంపదల వెనుక అమ్మ ఆశీస్సులున్నాయి!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు