మూడో మార్గం - మన గెలుపు (Eenadu Sunday Magazine 06/05/2012)




మూడో మార్గం


బంధువులూ మిత్రులు, సహోద్యోగులూ సహపాఠీలు, ఇరుగూపొరుగు-ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరితో ఏదో ఒక విషయంపై అభిప్రాయభేదం రావచ్చు. మాటామాటా పెరగొచ్చు. అదికాస్తా హింసకు దారితీయవచ్చు. ఏ సమస్య అయినా అంతదాకా రాకుండా, భేదాభిప్రాయాల్ని తొలగించుకోవడం ఎలాగో వ్యక్తిత్వవికాస రచయిత స్టీఫెన్‌ కోవె వివరిస్తున్నారు. 'మూడో ప్రత్యామ్నాయం' ద్వారా ఇరువర్గాలకూ నష్టం కలిగించని పరిష్కారాన్ని సూచిస్తున్నారు.


వివాద పరిష్కారానికి వివిధ మార్గాలు...
నీ దారి - మొదటి ప్రత్యామ్నాయం.
నా దారి - రెండో ప్రత్యామ్నాయం.
ఇది సంఘర్షణ పథం. ఎవరి ప్రయోజనాన్ని వారు చూసుకోవడం.
మరొకటి...
మనదారి - మూడో ప్రత్యామ్నాయం.
ఇదేమో సహకార పథం. కలిసి పరిష్కరించుకోవడం.
ఏ సంప్రదింపులైనా 'నేనే గెలవాలి' అన్న ఆలోచనతోనే ప్రారంభిస్తాం. 'ఎదుటి వ్యక్తి ఓడిపోవాలి' అన్న లక్ష్యంతోనే పావులు కదుపుతాం. కానీ మూడో ప్రత్యామ్నాయంలో 'నా గెలుపు', 'నీ గెలుపు' అన్న ఆలోచనకు తావుండదు.'మన గెలుపే' ఉంటుంది.
మనం పర్యావరణ ప్రేమికులం అయితే...ప్రకృతిలోని పచ్చదనాన్ని మాత్రమే చూస్తాం. అది కలకాలం పచ్చపచ్చగా ఉండాలని కోరుకుంటాం. దాన్ని వ్యతిరేకించేవారిని దుర్మార్గుల కింద జమకడతాం. మనం వ్యాపారవేత్తలం అయితే, ఆ కారడవి అడుగున ఉన్న ఖనిజ నిక్షేపాల్ని చూస్తాం. వాటిని ఎలా మార్కెట్‌ చేసుకోవాలో ఆలోచిస్తాం. ఆ ప్రయత్నాన్ని కాదనేవారు ఎవరైనా సరే, అభివృద్ధి నిరోధకులే అని భావిస్తాం. రెండూ పొంతనలేని ఆలోచనలే.
ఏదైనా ఒక విషయం గురించి ఆలోచిస్తున్నప్పుడు మన మెదడు వూహాచిత్రాన్ని గీసుకుంటుంది. 'మెంటల్‌ మ్యాపింగ్‌' అంటే అదే. ఎవరి కోణంనుంచి వారు ఆ బొమ్మను వేసుకుంటారు. వేరువేరుగా చూస్తే రెండూ అసమగ్రమే. రెండింటినీ కలిపితేనే...సర్వసమగ్రం!
నేను నీ ఆలోచనల్ని అర్థంచేసుకుంటా.
నువ్వు నా ఆలోచనల్ని జీర్ణించుకో.
అడవి నాశనం కాకుండా, పచ్చదనం పాడవకుండా...ఖనిజాల్ని తవ్వితీసుకునే మార్గాన్ని ఆలోచిద్దాం!
ఇది మూడోదారి. ఇదే 'థర్డ్‌ ఆల్టర్నేటివ్‌'.
మహాత్ముడి అహింసా పోరాటం కూడా మూడో ప్రత్యామ్నాయమే. శక్తిమంతుడైన శత్రువు మీద నేరుగా దాడి చేయడం కాదు, అలా అని తలవంచుకుని బతకడమూ కాదు.
నిన్నమొన్నటిదాకా చాలామంది 'రాజీ' మార్గానికే ఓటేశారు. నిజానికి, అది ఏ సమస్యకూ పరిష్కారం కాదు. రాజీలో ఇద్దరూ ఎంతోకొంత కోల్పోతారు. ఇద్దర్లోనూ అసంతృప్తి గూడుకట్టుకుని ఉంటుంది. ఏదో ఒకరోజు అది బాంబులా బద్దలవుతుంది. అలా అని, అమీ తుమీ తేల్చుకుందామని అనుకుంటే, అంతిమంగా ఇద్దర్లో ఒకరే గెలుస్తారు. ఓడినవారు, అదను చూసి దెబ్బకొట్టాలనుకుంటారు. ఫలితం... దీర్ఘకాలంలో ఇద్దరికీ మనశ్శాంతి ఉండదు. పరోక్షంగా ఇద్దరూ ఓడిపోయినట్టే.
సమస్యకు ఒకవైపున మనం...
మరోవైపున ఇంకో వ్యక్తి...
ఎవరి తరఫున వారు ఆలోచించినంత కాలం ఎలాంటి పరిష్కారమూ లభించదు. ఇద్దరూ కలిసి, ఇద్దరివైపు నుంచీ మూడో పరిష్కారాన్ని వెతుక్కోవాలి. ఆ సమష్ఠిశక్తి కొత్త బలాన్నిస్తుంది. సరికొత్త ఆలోచననిస్తుంది. అది, మిగిలిన రెండు పరిష్కారాలకంటే ఉత్తమమైనదై ఉంటుంది.
రెండు ఒకట్లు రెండు కాదు...పదకొండు!
ఒకరు, ఒకరు కలిస్తే...ఇద్దరు కాదు పాతికమంది!
ఒకటి పక్కన మరొకటి చేరడం వల్ల వచ్చిన ఆ శక్తే 'సినర్జీ', స్టీఫెన్‌ కోవె మూడో ప్రత్యామ్నాయానికి మూలస్తంభం.
ఎర్రచందనం చెట్టు ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతుంది. దానివల్ల లాభంకంటే నష్టమే ఎక్కువ. పెనుగాలి దెబ్బకు కుప్పకూలిపోతుంది. కూలుతూకూలుతూ పక్కనే ఉన్న ఇంకో చెట్టునూ కూల్చేస్తుంది. అలా అని, ఏ చెట్టూ పక్కనున్న చెట్టే తన శత్రువని అనుకోలేదు. ఆ సమస్యను 'నీ సమస్య'గానో, 'నా సమస్య'గానో భావించలేదు. 'మన సమస్య' అనుకున్నాయి. అంతే! పరిష్కారం దొరికింది. భూమిపొరల్లో.. ఒక చెట్టువేళ్లు మరో చెట్టువేళ్లతో పెనవేసుకోవడం మొదలుపెట్టాయి. దీనివల్ల కొత్తశక్తి వచ్చింది. ఏ గాలులూ వాటినేమీ చేయలేకపోయాయి. సమస్యను సమష్ఠిగా పరిష్కరించుకోవడం అంటే ఇదే.
ఓ పక్షి తనకున్న రెక్కల బలంతో గంటకు పది కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదని అనుకుందాం. అదే పక్షి...ఒక బృందంగా వెళ్తే సునాయాసంగా ఇరవై కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. అది సమష్ఠిశక్తి వల్ల వచ్చిన వేగం. ఆంగ్లాక్షరం 'వి' నమూనాలో ప్రయాణించడం వల్ల...ఎదురుగాలిని సులభంగా అధిగమిస్తుందా పక్షుల బృందం. రాళ్ల మీద ఎలాంటి జీవజాలం మనలేదు. అది గ్రీన్‌ ఆల్గే కావచ్చు, ఫంగస్‌ కావచ్చు. కానీ రెండూ ఒక్కటైతే... బండరాయిని సైతం నివాసయోగ్యంగా మార్చుకోగలవు.
ఇనుము, నికెల్‌, క్రోమియం...మూడూ మూడు లోహాలు. మూడింటినీ మిశ్రమం చేస్తే...వాటిగట్టిదనం రెట్టింపు అవుతుంది. ఇదంతా 'సినర్జీ' మహిమే. అంత శక్తిమంతమైన సినర్జీ...మన సమస్యల్ని మాత్రం పరిష్కరించలేదా! తప్పకుండా పరిష్కరిస్తుంది. అయితే ఒక నిబంధన.. మనం మారాలి, మన ఆలోచనా విధానాన్ని సమూలంగా మార్చుకోవాలి. ఆలోచన మారితే... స్పందించే పద్ధతి మారుతుంది, సంభాషించే తీరు మారుతుంది. మూడో ప్రత్యామ్నాయానికి కావలసింది అలాంటి మార్పే!

ఆలోచన మారాలి!
మన ఆలోచనల మీద గతానుభవాల ప్రభావం ఉంటుంది. ఏదో ఒక అనుభవానికి ముడిపెట్టి...ఒక వ్యక్తి మంచివాడనో, చెడ్డవాడనో ముద్రవేసేస్తాం. ఫలానా ప్రాంతం వాళ్లు తెలివైనవాళ్లనో మూర్ఖులనో తేల్చిపడేస్తాం. ఫలానా గ్రామస్తులో ఫలానా కుటుంబం వాళ్లో దుర్మార్గులనో సన్మార్గులనో తీర్పు ఇచ్చేస్తాం. అభిప్రాయభేదాల్ని తొలగించుకుంటున్నప్పుడు...ఇలాంటి అపోహలే అడ్డుగోడలవుతాయి. చిరకాల స్నేహితుడే కావచ్చు. ఇన్నేళ్లుగా కలసి కాపురం చేస్తున్న జీవిత భాగస్వామే కావచ్చు. కడుపున పుట్టిన పిల్లలే కావచ్చు. ఎవరైనా సరే, మన ఆలోచనల్ని వ్యతిరేకిస్తున్నారంటే, మన భావాల్ని తిరస్కరిస్తున్నారంటే...ఆ మరుక్షణం నుంచి శత్రువుల్లా చూస్తాం. ఆ వ్యక్తి తెలివితేటలు, విద్యార్హతలు, గుర్తింపు, సృజన... ఇవేవీ పట్టించుకోం. కత్తిదూసినట్టు మాట్లాడతాం. మన కళ్లకేవో రంగుల కళ్లద్దాలు పెట్టుకుంటాం. ప్రపంచమంతా ఆ రంగులోనే ఉందని భ్రమపడతాం. ఆ మాయావర్ణమే సకల సమస్యలకూ కారణం. ముందా కళ్లజోడు తీసెయ్యాలి. ఎదుటి వ్యక్తినీ అంతే స్వచ్ఛంగా చూడగలగాలి. అతని కులం, మతం, చదువు, హోదా...ఆ క్షణంలో ఏవీ గుర్తుకురాకూడదు. ఇవన్నీ మనిషిని మనిషిగా చూడలేని బలహీనతకు చిహ్నాలు. చక్కని సూర్యోదయాన్నీ, చల్లని సంధ్యాసమయాన్నీ, అప్పుడే విచ్చుకున్న లేతగులాబీనీ...ఎంత నిజాయతీగా మెచ్చుకుంటామో అంతే స్వచ్ఛంగా ఎదుటి మనిషిలోని మంచినీ గుర్తించగలగాలి.నెల్సన్‌ మండేలా ఇరవై ఏడేళ్ల జైలు జీవితాన్ని అనుభవించాడు. ఆయన కాపలాదారు తెల్లవాడు. మండేలాకు శ్వేతజాతి మీద కోపం ఉంది. కాపలా ఉద్యోగికి నల్లవాళ్లంటే చులకన. కొంతకాలానికి, ఒకర్ని ఒకరు అర్థంచేసుకున్నారు. అపోహలన్నీ తొలగిపోయాయి. మంచి స్నేహితుల్లా మారిపోయారు. మనిషిని మనిషిగా చూడటం వల్ల కలిగిన మార్పు అది.
ఏ సమస్య పరిష్కారానికి అయినా, తొలి అడుగు మనదే కావాలి. అవసరమైతే మలి అడుగూ మనమే వేయాలి...
భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. అవి భేదాభిప్రాయాలు కాకూడదు. ఎదుటి వ్యక్తి భావాలను వ్యతిరేకించకూడదు, కించపరచకూడదు, తొక్కిపెట్టకూడదు.
ఎదుటి వ్యక్తి తన వాదనను వినిపిస్తున్నప్పుడు...వ్యాఖ్యలొద్దు, తిప్పికొట్టే ప్రయత్నాలొద్దు, బదులిచ్చే ఆలోచన వద్దు, వ్యంగ్యాస్త్రాలొద్దు. ఒళ్లుమండే వాదనలొద్దు. సావధానంగా వినాలి. ఎదుటి మనిషి తన గోడు వింటున్నాడన్న భావనే సగం తీవ్రతను తగ్గిస్తుంది.
నెగెటివ్‌ భావనలు వద్దే వద్దు. దీనివల్ల పరిష్కారం మన పక్కనే ఉన్నా గుర్తించలేం. టొమాటో తొలిసారిగా యూరప్‌ ప్రజలకు పరిచయమైనప్పుడు... అదో మాయదారి పండని ప్రచారంచేశాడో ఫ్రెంచి వృక్షశాస్త్రవేత్త. తింటే ప్రాణానికే ముప్పని భయపెట్టాడు. అదే సమయంలో స్కర్వీ వ్యాధి ప్రబలింది. దీనికి ప్రధాన కారణం విటమిన్‌-సి లోపం. పక్కనే ఆ విటమిన్‌ పుష్కలంగా దొరికే టొమాటో ఉంది. నెగెటివ్‌ భావనలు ఆ ద్వారాన్ని మూసేశాయి. దీంతో వేలమంది ప్రాణాలు కోల్పోయారు.
సమస్యను పరిష్కరించుకోవడంలో మనకు చిత్తశుద్ధి ఉందన్న విషయం ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలా వ్యవహరించాలి. 'మనిద్దరమూ అనుకుంటున్నట్టుగా కాకుండా...నాకూ నష్టం కలిగించని, నీకూ నష్టం కలిగించని ఇంకో పరిష్కారం గురించి ఆలోచిద్దాం' అని ఒప్పించాలి. అలాంటి ప్రశాంత వాతావరణంలో, రెండు మనసుల ప్రేమపూర్వక భేటీలో ఎంతపెద్ద సమస్య అయినా సులభంగా పరిష్కారం అవుతుంది. ఎన్ని చిక్కుముడులైనా ఇట్టే వీడిపోతాయి.
ఇల్లే పునాది...
ఒక సిద్ధాంతం, ఒక చిట్కా, ఒక విధానం...కుటుంబ స్థాయిలో విజయవంతమైందంటే, అంతర్జాతీయంగానూ అద్భుత ఫలితాలు సాధిస్తుందనే అర్థం. 'మూడో ప్రత్యామ్నాయం'తో సమస్యల్ని పరిష్కరించుకోవడం ద్వారా కుటుంబ జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు.
ఇద్దరు వ్యక్తుల వివాహబంధంతో కుటుంబంలో 'మూడో ప్రత్యామ్నాయం' మొదలవుతుంది. ఆమె పెంపకం ఒకలాంటిది. అతని పెంపకం మరోలాంటిది. ఇద్దరికీ పెళ్లవుతుంది. కొత్త కాపురం ప్రారంభమవుతుంది. ఆమెకు శాకాహారం ఇష్టం. అతనికి మాంసాహారం ప్రాణం. సంప్రదాయ పరిష్కార మార్గాల్లో అయితే...ఎవరో ఒకరు తమ ఆహార విధానాన్ని పూర్తిగా మార్చుకోవాల్సి ఉంటుంది. మూడో ప్రత్యామ్నాయంలో ఆ అవసరమే ఉండదు. ఆ ఇంట్లో... గురువారం, శనివారం, సోమవారం శాకాహారం. మిగిలిన మూడురోజూలూ మాంసాహారం. ఆదివారం మాత్రం రెండూ!
ఆమెకు భక్తి ఎక్కువ. రోజూ గంటసేపైనా పూజలు చేస్తుంది. అతనేమో పరమ నాస్తికుడు. ఇంట్లో దేవుడి పటాలు కనిపించకూడదంటాడు. ఇద్దరూ ఓచోట కూర్చుని చర్చించుకున్నారు. మూడో ప్రత్యామ్నాయాన్ని ఎంచుకున్నారు. ఆమె కోసం తన పుస్తకాల గదిని పూజామందిరంగా మార్చి ఇచ్చేశాడు అతను. హాల్లోని పటాలన్నీ తీసుకెళ్లి ఆ గదిలో అలంకరించుకుందామె. ఎంత మంచి పరిష్కారం.

నా సమస్య + నీ సమస్య- మన సమస్య
కడదాకా కూడా ఈ సూత్రాన్నే పాటిస్తే...అనుబంధాలకు బీటలుండవు, ఆలూమగల మధ్య తీవ్ర ఘర్షణలుండవు. చాలా సందర్భాల్లో పెళ్లి పాతబడేకొద్దీ...'నువ్వా', 'నేనా' అన్నట్టే ఉంటుంది వ్యవహారం. 'మన' అన్న ఆలోచన కనుమరుగవుతుంది. కాఫీ రుచిగా లేదని ఆయన చిర్రుబుర్రులాడటం, ఆఫీసు నుంచి ఆలస్యంగా వచ్చాడని ఆమె రుసరుసలాడటం... అసలు సమస్యలు కాదు. ఓ తీవ్ర సమస్య తాలూకు లక్షణాలు మాత్రమే. మనం గుర్తించాల్సింది ఆ మూలాల్నే. మూడో ప్రత్యామ్నాయం చెబుతున్నదీ అదే.ఓ చిన్నారికి సంగీతమంటే ఇష్టం. చదువంటే భయం. క్లాసులో ఎప్పుడూ చివరి స్థానమే. ఏ తల్లిదండ్రులైనా ఏం చేస్తారు... 'సంగీతం గురించి మాట్లాడావంటే కాళ్లిరగ్గొడతాం. బుద్ధిగా చదువుకో...' అంటూ గుడ్లురుముతారు. అది ఘర్షణ.
'మా అమ్మాయి బాగా చదువుకోవాలని మా కోరిక. ఏం చేస్తాం! మాకా ప్రాప్తం లేదు. తప్పనిసరై సంగీతం నేర్పిస్తున్నాం...' అని నిరుత్సాహంగా మాట్లాడతారు. అది రాజీ.
ఆలోచనల్ని మేళవించడమే మూడో ప్రత్యామ్నాయం. పాటలే పాఠాలైతే... తిరుగేముంది? సంగీతం ద్వారా పాఠాలు చెప్పే స్కూల్లో తమ కూతుర్ని చేర్పించారు. ఆర్నెల్లు తిరిగేసరికి అమ్మాయి క్లాసులో మొదటి స్థానానికి వచ్చింది.
కుటుంబంలో, ఉద్యోగంలో, కాలేజీలో, కాలనీలో...మనకు ఎదురయ్యే రకరకాల సమస్యలను నొప్పింపక తానొవ్వక పరిష్కరించుకునే విధానమిది. మనసుపెట్టి ప్రయత్నించాలే కాని, ప్రతి సమస్యకూ 'మూడో ప్రత్యామ్నాయం' దొరుకుతుంది.
అసలు సమస్య ఏమిటంటే..మనం ఆ వైపుగా ఆలోచించం. అటో-ఇటో...అన్న ధోరణికే అలవాటుపడిపోయాం. అన్నిటికీ మించి 'అదంతే', 'ఇదంతే', 'వాళ్లంతే...' తరహా అభిప్రాయాలు మన మనసులో స్థిరపడి ఉంటాయి. నిరాశావాదం ఏ సమస్యకూ పరిష్కారాన్ని ఇవ్వలేదు. సరికదా, మరిన్ని సమస్యల్ని సృష్టిస్తుంది.
వ్యాపారంలోనూ...
బోర్డ్‌రూమ్‌ మీటింగ్‌లో ఉన్నతోద్యోగులంతా 'ఒకేమాట-ఒకేబాట' అన్నట్టుగా ఉంటే, 'ఆహా! క్రమశిక్షణ అంటే ఇదీ...' అని అంతా అనుకుంటూ ఉంటారు. నిజానికి, అదంత ఆహ్వానించదగిన పరిమాణం కాదు. ఓ తీవ్ర సంక్షోభానికి సంకేతం. ఏ సంస్థలో అయినా, ఎన్ని అభిప్రాయాలు వ్యక్తమైతే అంత మంచిది. పదిమందీ ఒకే అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నప్పుడు...అక్కడ పదిమంది ఉండాల్సిన అవసరమే లేదు. ఒక్కరు చాలు. మిగిలినవాళ్లంతా దండగే అన్నమాట. నిజమైన వ్యాపారనాయకుడు రకరకాల అభిప్రాయాలను ప్రోత్సహిస్తాడు. అందులోంచే, సంస్థ భవిష్యత్తును మలుపుతిప్పే 'థర్డ్‌ ఆల్టర్నేటివ్‌' ఉండవచ్చు. అసలెవరూ వాదించుకోవడం లేదంటే... ఏదో సమస్య ఉందని అర్థం. అలాంటి కంపెనీలు ఎక్కువకాలం నిలబడవు. ఓ వెలుగు వెలిగి, అంతలోనే కుప్పకూలిపోయిన...ఎన్రాన్‌ సంస్థే అందుకు ఉదాహరణ అంటారు 'వై స్మార్ట్‌ ఎగ్జిక్యూటివ్స్‌ ఫెయిల్‌' రచయిత సిడ్నీ ఫింకిల్‌స్టన్‌. అక్కడ కొత్త ఐడియాలకు గుర్తింపులేదు, భయాలకు భరోసాలేదు, వాదనలకు జవాబుల్లేవు. ఒకటే సమాధానం...తొలగింపు! అందుకే, ఆ కంపెనీ చరిత్రలో కలిసిపోయింది.
ఎక్కువ నాణ్యత.
తక్కువ ధర.
రెండూ రెండు కోణాలు.
నాణ్యత పెంచితే ధర పెరుగుతుంది.
ధర తగ్గిస్తే నాణ్యత తగ్గించాలి.
ఈ సమస్యకు మూడో ప్రత్యామ్నాయం ఉంది. అదేమిటో జపనీయులు నిరూపించారు. 1940లలో ప్రొఫెసర్‌ ఎడ్వర్డ్‌ డెమింగ్‌ అనే పెద్దమనిషి నాణ్యత ప్రాధాన్యాన్ని నొక్కిచెప్పాడు. లేకపోతే, పారిశ్రామిక రంగానికి కష్టాలు తప్పవని హెచ్చరించాడు. అయినా అమెరికన్‌ పారిశ్రామికవేత్తలు పట్టించుకోలేదు. ఖర్చు తగ్గించుకోడానికి పరిశోధన-అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ) విభాగానికి కోతలు పెట్టారు. కొనుగోలుదారుడిని ఎలా బుట్టలో వేసుకోవాలన్న ఆలోచనకే పెద్దపీట వేశారు. మార్కెటింగ్‌ జిమ్మిక్కుల మీదే ఆధారపడ్డారు. దీంతో డెమింగ్‌ అమెరికా నుంచి జపాన్‌ వెళ్లిపోయాడు. ఆయన నేతృత్వంలో...నాణ్యత తగ్గించకుండానే తయారీ ఖర్చు తగ్గించుకునే ప్రయత్నం మొదలుపెట్టింది జపాన్‌ పారిశ్రామిక రంగం. లోపాల్ని సవరించుకోవడం ద్వారా, టెక్నాలజీని పెంచుకోవడం ద్వారా, వృథాను అరికట్టడం ద్వారా ఇది సాధ్యమైంది. అమెరికా మూడో ప్రత్యామ్నాయం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఫలితంగా జపాన్‌ ఉత్పత్తులను ఎదుర్కోడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. భారీ పరిశ్రమే కానక్కర్లేదు. మనం నడిపేది చిల్లర దుకాణమే కావచ్చు. రోజుకు ఓ వేయి రూపాయల వ్యాపారమే కావచ్చు. ప్రతి సమస్యలో, ప్రతి సంక్షోభంలో 'మూడో ప్రత్యామ్నాయం' గురించి ఆలోచించడం మానకూడదు.
అన్ని సందర్భాల్లో అన్ని రకాల వ్యక్తుల విషయంలో 'మూడో ప్రత్యామ్నాయం' సాధ్యమేనా?
దీనికి స్టీఫెన్‌కోవె సమాధానం:
'రెండు మినహాయింపులున్నాయి.
గుండెలేని మనుషులు.
మెదడులేని మనుషులు.
ఈ ఇద్దర్నీ మినహాయిస్తే... ఈ సూత్రం ఎక్కడైనా పనిచేస్తుంది. ప్రపంచంలోని అత్యుత్తమ వ్యక్తులంతా దీని పరిధిలోకే వస్తారు'.

మూడోమనిషి...

మూడోప్రత్యామ్నాయ మార్గంలో ఆలోచించడం అంత సులభం కాదు. ఎందుకంటే, బాల్యం నుంచీ మన అభిప్రాయాలూ నమ్మకాలూ ఓ మూసలో సాగుతున్నాయి. ముందుగా ఆ ప్రభావం నుంచి బయటపడాలి. దానికి కొంత సాధన అవసరం...


అహం పనికిరాదు
హంభావమే అసలు శత్రువు. 'నేనే గొప్ప', 'నా మాటే వేదం'... అన్న భ్రమలొద్దు. ఎంత పెద్ద అద్దమైనా మనల్ని నూటికి నూరుశాతం ప్రతిబింబించదు. కనిపించని కోణాలూ ఉంటాయి.

'సారీ' చెప్పండి
తెలిసో తెలియకో కొన్నిసార్లు ఎదుటి వ్యక్తికి బాధ కలిగిస్తూ ఉంటాం. తటపటాయింపులొద్దు. వెంటనే, 'సారీ' చెప్పేయండి. ఆ పొరపాటుకు బాధ్యత తీసుకోండి. మిమ్మల్ని మీరు సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి.

ప్రకృతి ఒడిలో
చ్చని ప్రకృతి మధ్య గడపడం అంటే... ఆత్మకు అభ్యంగన స్నానం చేయించడమే! దీనివల్ల ఆలోచనలు శుభ్రపడతాయి. ప్రకృతిలోని 'సినర్జీ'ని అర్థంచేసుకుంటాం. ప్రకృతిని మించిన గురువులేడు.

పుస్తక పఠనం
త్తమ సాహిత్యం ఆలోచనలను విస్తరిస్తుంది. మానసిక వికాసాన్నిస్తుంది. ఏ విషయాన్ని అయినా...భిన్న కోణాల్లోంచి చూసే నేర్పునిస్తుంది. 'మూడో ప్రత్యామ్నాయానికి' ఇదే ముడిసరుకు.

ఆరోగ్యంగా
యోగా వ్యాయామం, ప్రాణాయామం... జీవితంలో భాగం చేసుకోండి. టెన్నిస్‌, ఫుట్‌బాల్‌ వంటి ఆటలూ మంచిదే. శారీరక ఆరోగ్యం మనసును ప్రభావితం చేస్తుంది. మనసు ఆలోచనలపై ప్రభావం చూపుతుంది.

నిద్ర
రోజుకు ఏడెనిమిది గంటల నిద్ర అవసరం. మనం నిద్రలో ఉన్నప్పుడు మెదడు మరింత శక్తిని సంతరించుకుంటుంది. నిద్ర తగ్గితే ఉద్వేగ ప్రజ్ఞ తగ్గుతుంది. కోపతాపాల్ని నియంత్రించుకోలేం. మూడో ప్రత్యామ్నాయానికి ఇది తొలి శత్రువు.

చిరునవ్వు
ఫీసులో, బస్‌స్టాపులో, కిరాణాకొట్టులో, యోగా సెంటర్లో ఎంతోమందిని చూస్తూ ఉంటాం. ఎవరో వచ్చి పరిచయం చేసేదాకా... మాట్లాడకూడదన్న నిబంధనేం లేదు. మాట్లాడేంత తీరికలేకపోతే...ఓ చిరునవ్వు చాలు. 'నిన్ను గుర్తించాను. స్నేహితుడిగా ఆమోదించాను' అన్న సంకేతం ఉందా నవ్వులో.

ఆశావాదం
ట్టి పరిస్థితుల్లోనూ ఆశావాదాన్ని వదిలిపెట్టొద్దు. నిరాశకు లోనుకావొద్దు. దేశాల మధ్య సరిహద్దు గోడలు బద్దలవుతున్నాయి. ఆజన్మ శత్రువులు ఒక్కటవుతున్నారు. మీరు ఎదుర్కొంటున్న సమస్యలు అంతకంటే తీవ్రమైనవేం కాదు. ఒక సమావేశంలో సాధ్యం కాకపోవచ్చు, రెండు సమావేశాల తర్వాత, మూడు సమావేశాల తర్వాత, పది సమావేశాల తర్వాత... తప్పకుండా ఎంతోకొంత మార్పు వస్తుంది.

సంపూర్ణ సమాచారం
ర్ధసత్యం అనేది...మిగతా సగం సత్యాన్ని కూడా మింగేస్తుంది. ఏ విషయం గురించి అయినా మాట్లాడుతున్నప్పుడు మన దగ్గర సాధికారికమైన సమాచారం ఉండాలి. లేకపోతే సేకరించుకోవాలి.

'మూడో ప్రత్యామ్నాయం'... మూలపురుషుడు!
త శతాబ్దంలో సంఘర్షణలనేవి దేశాల మధ్య ఉండేవి, జాతుల మధ్య ఉండేవి, సిద్ధాంతాల మధ్య ఉండేవి. రానున్న కాలంలో విభేదాలు వ్యక్తిగత స్థాయిలోనే ఎక్కువగా ఉంటాయి. భార్య-భర్త, అన్న-తమ్ముడు, యజమాని-ఉద్యోగి, అమ్మకందారు-కొనుగోలుదారు ... ప్రతి ఇద్దరి మధ్యా ఏదో ఒక గొడవ, ఏదో ఒక అభిప్రాయభేదం. ఆ సమస్య నుంచి బయటపడటానికి 'మూడో ప్రత్యామ్నాయమే' మార్గమని చెబుతారు స్టీఫెన్‌కోవె. ఆయన రచించిన 'సెవెన్‌ హ్యాబిట్స్‌ ఆఫ్‌ హైలీ ఎఫెక్టివ్‌ పీపుల్‌' 20వ శతాబ్దంలోనే అత్యంత ప్రభావవంతమైన పుస్తకంగా పేరు తెచ్చుకుంది. ద ఎయిత్‌ హ్యాబిట్‌, ద లీడర్‌ ఇన్‌ మి, ఫస్ట్‌ థింగ్స్‌ ఫస్ట్‌.. కోవె ఇతర రచనలు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు