ఈ విమానాల్లో ఎన్ని విలాసాలో...!


ఆకాశంలో... అందమైన పడకగది. విలాసవంతమైన ఫర్నిచర్‌. డైనింగ్‌ టేబుల్‌ మీద బంగారంతో చేసిన ప్లేట్లూ దాన్లో రుచికరమైన వంటకాలు. ఆటలు, వినోదం, వ్యాపార సమావేశాలకు ప్రత్యేకగదులు... ఇలా ఎన్నెన్నో హంగులూ ఆర్భాటాలతో సొంత విమానాన్ని చిన్నసైజు రాజమహల్‌గా మార్చేసుకుని గగనంలో విహరిస్తున్నారు ఈ సంపన్నులు.
ప్రస్తుతం మన దేశంలో 150కి పైగా సొంత విమానాలున్నాయట. త్వరలోనే వాటి సంఖ్య రెట్టింపవుతుందనేది ఓ అంచనా. ఆసియాలోనే ఇలా ఎక్కువ సొంత విమానాలున్న దేశం మనదే. ప్రపంచవ్యాప్తంగానూ బిలియనీర్లు సొంత విమానాలను కొనడం కొంతకాలంగా సాధారణం అయిపోయింది. అయితే, అందులో కోట్లు ఖర్చుపెట్టి విలాసవంతమైన సౌకర్యాలను ఏర్పాటుచేసుకోవడం ఈమధ్య ఎక్కువైంది.

అల్‌ వలీద్‌ బిన్‌ తలాల్‌
సౌదీ రాజవంశీయుల్లో ఒకడైన తలాల్‌... రియల్‌ ఎస్టేట్‌, స్టాక్‌మార్కెట్ల ద్వారా వందల కోట్లు సంపాదించాడు. అసలే రాజవంశీయుడు పైగా డబ్బు కూడా ఉంది. ఇక, అతను తలచుకుంటే కానిదేముందీ. దాంతో తలాల్‌ 2007లో 'ఎయిర్‌బస్‌ ఏ 380' అనే ఓ విమానానికి ఆర్డరిచ్చాడు. సరిగ్గా అయిదేళ్ల తర్వాత ఈమధ్యే అది అతనింటికి చేరింది. రూ. 2500 కోట్ల ఖరీదైన ఈ విమానం ఇప్పుడున్న ప్రైవేటు విమానాలన్నింటిలోకీ ఖరీదైనదట. ఇంతకీ అందులో అంత ఘనం ఏముందీ అంటే... ఇది ఎగిరే రాజభవనం అని చెప్పాలి. ఇందులో సకల సౌకర్యాలతో హాలు, పడకగదులూ, స్నానాల గదులను ప్రత్యేకంగా నిర్మించారు. అంతేకాదు, నలుగురు మనుషులు ఒకేసారి ఆవిరిస్నానం చేసేందుకు వీలుగా ఓ గది, రెండు రోల్స్‌రాయిస్‌లను పార్క్‌ చేసేందుకు గ్యారేజ్‌, గుర్రాలూ, ఒంటెలను తరలించేందుకు వీలుగా నిర్మించిన గదులు, సుల్తానుగారు పెంచే పందెం డేగలకోసం పెద్ద బోను దీన్లో ఉన్న అదనపు హంగులు. ఖరీదైన ఫర్నిచర్‌తో పాటు గోడల మీద రకరకాల హోలోగ్రామ్‌ చిత్రాలూ ఈ విమానంలో దర్శనమిస్తాయి. ఇక, దీన్లో ఉన్న ప్రార్థనా మందిరం ఎప్పుడూ మక్కావైపు ఉండేలా తిరుగుతుందట. ఈ విమానానికన్నా ముందు తలాల్‌కు వెయ్యికోట్ల రూపాయల విలువైన 'బోయింగ్‌ 747' అనే మరో జెట్‌ ఉంది.ఈ విమానంలో ఉన్న హాల్లో అడుగడుగునా బంగారపు మెరుపులే కనిపిస్తాయి. డైనింగ్‌ టేబుల్‌, దానిమీద అమర్చిన ప్లేట్లు, గ్లాసులు స్పూన్లు కూడా బంగారపు పూత పూసినవే. ఇక, విలాసం తాండవిస్తున్నట్లున్న పడకగదులూ ఆఫీస్‌ రూమ్‌లను చూడ్డానికి రెండు కళ్లూ చాలవు.

బ్రూనై సుల్తాన్‌
సుల్తాన్‌ హసనల్‌ బొలికియాహ్‌కు ఉన్న విమానాల్లో 1200 కోట్ల రూపాయల విలువైన 'బోయింగ్‌ 747-400' ఒకటి. రాజుగారి ఈ విమానంలోపల చూస్తే నిజంగానే రాజసం ఉట్టి పడుతుంది. ఎటు చూసినా బంగారపు మెరుపులే మరి. అన్నిరకాల అవసరాలకనుగుణంగా ఏర్పాటు చేసిన ఫర్నిచర్‌తో పెద్ద హాలు, పడక గది, స్నానాల గది, ఆఫీసు గదీ ఉన్న ఈ విమానంలో ఎక్కువ భాగం ఫర్నిచర్‌ను బంగారంతో పూత పూయించాడు సుల్తాన్‌. అందుకే, బాత్‌రూమ్‌లో ఉన్న సింక్‌లూ పంపులూ కూడా బంగారపు వర్ణంలో తళతళలాడిపోతాయి.విజయ్‌ మాల్యా
కింగ్‌ ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ అధినేత విజయ్‌ మాల్యా కూడా 'ఏ 319 ఏసీజే' అనే ఓ విలాసవంతమైన జెట్‌కు యజమాని. దూరప్రాంతాలకు ప్రయాణించినపుడు దీన్ని ఆయన ఇల్లూ ఆఫీసుగా కూడా ఉపయోగిస్తారు. 24మంది ప్రయాణించగలిగే ఈ విమానం ఖరీదు 213కోట్ల రూపాయలు. ఇంట్లో ఉన్నట్లు సౌకర్యంగా ప్రయాణించడానికీ, అలంకరణకూ, అగ్నినిరోధక పెయింట్‌ను వేయించడానికీ అదనంగా మరికొన్ని కోట్లు ఖర్చుపెట్టారు విజయ్‌మాల్యా. ఆయనకు గల్ఫ్‌స్ట్రీమ్‌, హాకర్‌, బోయింగ్‌ 727 అనే మరో మూడు విమానాలు కూడా ఉన్నాయి.
అనిల్‌ అంబానీ
'రిలయన్స్‌ అనిల్‌ ధీరూభాయి అంబానీ గ్రూప్‌' ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ ఈమధ్యకాలంలో కొన్న 'జెట్‌ గ్లోబల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌' ఖరీదు రూ.200 కోట్లు. ఈ జెట్‌లో ఉన్న క్యాబిన్‌లో కూర్చుంటే విమానంలో ప్రయాణిస్తున్నట్లే ఉండదట. అది శబ్దాన్నీ వైబ్రేషన్‌నూ నియంత్రించే క్యాబిన్‌ మరి. దీనివల్ల ఆఫీస్‌ రూమ్‌లో వ్యాపారవ్యవహారాలను నిరాటంకంగా చర్చించుకోవచ్చు. ఇందులో బోర్డ్‌ మీటింగులు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా పెద్ద కాన్ఫరెన్స్‌ టేబుల్‌ను కూడా ఏర్పాటుచేసుకున్నారు అనిల్‌. ఈ విమానంలో విలాసవంతమైన ఫర్నిచర్‌తో పెద్ద హాలు కూడా ఉంది. బిల్‌ క్లింటన్‌, స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌లాంటి కొద్ది మంది దగ్గరే ఇలాంటి ప్రత్యేకతలున్న జెట్‌లు ఉన్నాయి. దీంతోపాటు అనిల్‌ అంబానీ మరో రెండు విమానాలకూ యజమాని.
లక్ష్మీనివాస్‌ మిట్టల్‌
స్టీలు దిగ్గజం లక్ష్మీనివాస్‌ మిట్టల్‌ దగ్గరున్న 'గల్ఫ్‌స్ట్రీమ్‌ జీ 550' ప్రైవేటు విమానాన్ని మిలిటరీ విమానాలకు వాడే హెడ్స్‌ అప్‌ టెక్నాలజీతో రూపొందించారు. గంటకు 675 మైళ్ల వేగంతో ప్రయాణించగల ఈ జెట్‌లో 19మందికి పైగా కూర్చోవచ్చు. ఇలాంటి ప్రత్యేకతలున్న ప్రైవేటు జెట్‌లు ప్రపంచంలోనే చాలా అరుదు. 213 కోట్ల రూపాయల ఖరీదైన ఈ విమానంలో పడకగది, కాన్ఫరెన్స్‌ గది, విలువైన అలంకరణ వస్తువులు, పెద్ద ఎల్‌సీడీ టీవీలు... లక్ష్మీ మిట్టల్‌ అదనంగా చేర్చిన హంగులు.
రోమన్‌ అబ్రమోవిచ్‌
అతిపెద్ద ప్రైవేటు విమానం అయిన 'ఎయిర్‌ బస్‌ ఏ340'ను కొన్న మొదటి వ్యక్తి రష్యాకు చెందిన బిలియనీర్‌... రోమన్‌ అబ్రమోవిచ్‌. సుమారు వెయ్యి కోట్ల రూపాయల విలువైన ఈ విమానంలో జిమ్‌, ఆవిరి స్నానం చేయడానికి ప్రత్యేక గది, కాన్ఫరెన్స్‌ గదులు, స్పా, బార్‌, రెస్టారెంట్‌ పెద్ద పడక గది, ఖరీదైన ఫర్నిచర్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
బోయింగ్‌ 767-33ఏ/ఈఆర్‌... ఇది అబ్రమోవిచ్‌ దగ్గరున్న మరో విమానం. దీన్లో యాంటీ మిస్సైల్‌ సిస్టమ్‌ ఉంది. దీని లోపల ముదురు ఎరుపురంగులో ఉడ్‌వర్క్‌ చేసి, బంగారపు వస్తువులతో అలంకరించారు. దీన్లో ఉన్న భోజనాల హాల్లో ముప్ఫైమంది కూర్చుని భోంచేయొచ్చు. ఇక, తన వ్యాపార వ్యవహారాల గురించి చర్చించుకునేందుకు వీలుగా ఎలాంటి శబ్దాలూ వినిపించని విధంగా ఓ మీటింగ్‌ రూమ్‌ను కూడా ఏర్పాటుచేసుకున్నాడు అబ్రమోవిచ్‌.
ముఖేష్‌ అంబానీ
నదేశంలోనే అత్యంత సంపన్నుడైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ దగ్గరున్న 'బోయింగ్‌ బిజినెస్‌ జెట్‌2' ఖరీదు రూ.389 కోట్లు. 1004 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ విమానంలో స్నేహితులు ప్రయాణించడానికి ప్రత్యేకంగా ఒక గదీ దాన్లో ఎగ్జిక్యూటివ్‌ సీట్లూ ఉంటాయి. ఇక, ముఖేష్‌ కుటుంబం కోసం ప్రైవేట్‌ సూట్‌ వేరుగా ఉంటుంది. దాన్లో ఉండే పెద్ద పడకగది, బోర్డ్‌రూమ్‌, హైటెక్‌ ఆఫీస్‌, డైనింగ్‌ హాల్‌... ఆకాశంలోనూ సకల సౌకర్యాలు కల్పిస్తాయి. 78మంది ప్రయాణించగలిగే ఈ విమానంలో ఆధునిక టెక్నాలజీకి సంబంధించిన అన్ని సౌకర్యాలూ ఉన్నాయి. ఇది కాకుండా ముఖేష్‌ అంబానీ దగ్గర మరో రెండు విమానాలున్నాయి. వీటిలో 'ఎయిర్‌ బస్‌ 319 కార్పొరేట్‌ జెట్‌'ను 2007లో తన భార్యకు పుట్టిన రోజు కానుకగా ఇచ్చాడు. 242 కోట్ల రూపాయల విలువైన ఈ విమానంలో పెద్ద ఆఫీసు, బార్‌, ఫ్యాన్సీ షవర్లతో స్నానాలగది, పిల్లల ఆటవస్తువులతో కూడిన ఓ క్యాబిన్‌, మ్యూజిక్‌ సిస్టంలు, శాటిలైట్‌ టెలివిజన్‌, వైర్‌లెస్‌ కమ్యూనికేషన్స్‌లాంటి సౌకర్యాలన్నీ అదనంగా చేర్చినవే.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు