Eenadu Eetaram (05/05/2012)


ఎవరన్నారు? వైకల్యం పెను శాపమని... ఎవరన్నారు? వాళ్లు జీవితంలో ఎదగలేరని... ఒక స్టీఫెన్‌ హాకింగ్‌.. ఒక బీతోవెన్‌... అవకరాలతోనే అద్భుతాలు సాధించారు... ఇలాంటి అసాధారణ విజేతలు... ఎక్కడో కాదు, మన మధ్య కూడా కనిపిస్తారు... ఆత్మవిశ్వాసం వాళ్ల సొత్తు. జాలి వాళ్లకి నచ్చని మాట... అలాంటి ఇద్దరు యువతరంగాల స్ఫూర్తి కథనం ఈవారం.
చదువుల ముత్యం
ఇంటర్లో స్టేట్‌ ఫస్ట్‌. డిగ్రీలో గోల్డ్‌ మెడల్‌. మెరిట్‌ స్కాలర్‌షిప్‌లు. గళాన్ని చక్కగా పలికించే మేటి 'పాట'వం. తాజాగా అతి చిన్న వయసులోనే ప్రతిష్ఠాత్మక జర్నల్స్‌లో వ్యాసం ప్రచురణ. ఇన్ని ఘనతల జ్యోత్స్న ఫణీజఈ లోకాన్ని చూడలేదంటే ఆశ్చర్యమే!
జ్యోత్స్న కళ్లు మామూలుగానే ఉంటాయి. కానీ వాటికి చూపు లేదు. సొంతూరు కైకలూరు. పది వరకు నర్సాపురంలో చదివింది. అన్ని తరగతుల్లో ఆమే టాప్‌. వయసు తక్కువని ఇంటర్లో చేర్చుకోలేదు. ప్రత్యేక అనుమతి తెచ్చుకొని మరీ కాలేజీలో చేరింది. అక్కడే ఆమె ప్రతిభ వెలుగులోకి వచ్చింది. హెచ్‌.ఇ.సి.లో స్టేట్‌ఫస్ట్‌. అదీ మామూలు విద్యార్థులతో పోటీపడి. ప్రతిభ పురస్కారం, గోల్డ్‌ మెడల్‌, మెరిట్‌ స్కాలర్‌షిప్‌లు అందాయి. డిగ్రీలోనూ ఆ జోరు తగ్గలేదు. బీఏలో మొదటి ర్యాంక్‌తో గోల్డ్‌మెడల్‌ దక్కించుకుంది. లక్షల మందితో పోటీపడి ఫెయిర్‌ అండ్‌ లవ్‌లీ, ధీరూభాయ్‌ అంబానీ మెరిట్‌స్కాలర్‌షిప్‌లు గెల్చుకుంది. హైదరాబాద్‌లో అడుగుపెట్టాక ఆమె ప్రతిభ మరింత వికసించింది. అప్పటిదాకా బ్రెయిలీ లిపిలో చదివిన జ్యోత్స్న కష్టపడి కంప్యూటర్‌ శిక్షణ తీసుకుంది. ఆపై కంప్యూటర్‌ స్క్రీన్‌ రీడర్‌ సాయంతో పుస్తకాల్ని స్కాన్‌ చేసి చదివేది. తర్వాత ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ (ఇఫ్లూ)లో చేరి ఎం.ఎం. ఆంగ్ల సాహిత్యంతో పీజీ పూర్తి చేసింది. ఇప్పుడు అదే సబ్జెక్టుతో పీహెచ్‌డీ చేస్తోంది. మొదటి సంవత్సరంలోనే బ్రిటీష్‌ పాలిత దేశాల్లో సంప్రదాయంగా వస్తున్న రచనలను నేటితరం రచయిత్రులు ఎలా బ్రేక్‌ చేశారనే అంశంపై పరిశోధక వ్యాసం రాసింది. ఈ వ్యాసం ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్‌ బుక్‌ నెంబర్‌ (ఐఎస్‌బీఎన్‌) జర్నల్‌లో ప్రచురితమైంది. అంతకుముందు పీహెచ్‌డీ కోసం పదమూడు విశ్వవిద్యాలయాల్లో ప్రవేశ పరీక్ష రాస్తే అన్నింట్లో జ్యోత్స్నకు సీటొచ్చింది. ఇంకో ఏడాది గడిస్తే అతిచిన్న వయసులో పీహెచ్‌డీ పూర్తిచేసిన ఘనత ఆమెకి దక్కుతుంది.ఆటపాటల్లోనూ మేటి
జ్యోత్స్న ప్రతిభ చదువుకే పరిమితం కాలేదు. ఆయుర్వేదంలో అడ్వాన్డ్స్‌ డిప్లమో చేసింది. ఇంగ్లిష్‌, హిందీ, ఫ్రెంచ్‌, మళయాళం భాషలూ మాట్లాడుతుంది. మా టీవీ నిర్వహించిన 'సింగ్‌ ఏ సాంగ్‌' పోటీల్లో ఫైనల్‌కి చేరింది. యోగా, నాటకం, నృత్యాల్లో అభినివేశం ఉంది. వికలాంగ మహిళల హక్కులపై జాతీయస్థాయి సెమినార్‌లో పాల్గొని పేపర్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చింది. తనలో చెలరేగే భావాల్ని అక్షరాలుగా మలిచి కవితలల్లి ఓ బ్లాగ్‌నే నిర్వహిస్తోంది. అయితే ఇన్ని విజయాల్లో జ్యోత్స్న ఏనాడూ వికలాంగ రిజర్వేషన్‌ ఉపయోగించుకోకపోవడం ఆమె ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. తాను అంధురాలనే బాధ ఆమెకి ఏ కోశానా లేదు. ఇతరులు తనపై జాలి పడటం నచ్చదు. చదువుల్లో రాణించలేక, పాస్‌ మార్కులు తెచ్చుకోలేక ఆపసోపాలు పడుతున్న చాలామంది యువతకు జ్యోత్స్న నిజంగా ఓ స్ఫూర్తిప్రదాతే.
- రాకేశ్‌ పాతూరి, న్యూస్‌టుడే: హైదరాబాద్‌
చేతుల్లేకున్నా చేతలు భేష్‌!
చేతుల్లేవ్‌. అయినా ఆ కుర్రాడి చేతలకు తక్కువేం కాదు. చక్రాల బండితో బతుకు బండి లాగుతూనే దూసుకెళ్తున్నాడు. కాళ్లనే చేతులుగా మలిచి పరీక్షలు రాస్తున్నాడు. జనం మెచ్చే చిత్రాలు గీస్తున్నాడు. ఆ ప్రతిభకు అందిన బహుమతులు యాభైకి పైనే. ఆ విశాఖ యువకుడేపైలా జగన్నాథం.'ఇంకా చదువుతావా? ఎవర్ని ఉద్ధరించడానికమ్మా' సాటి విద్యార్థుల హేళన మాటలు జగన్నాథంలో కసిని పెంచాయి. చదువుతోనే వాళ్లకు సమాధానం చెప్పాలనుకున్నాడు. అప్పట్నుంచి అతడి లక్ష్యం ఉన్నత చదువులు. అదే కసితో కాలితో కుంచె పట్టాడు. జగన్నాథం సొంతూరు విశాఖపట్టణం జిల్లా చోడవరం మండలం బంగారమ్మపాలెం. మేనరికం కారణంగా చిన్నప్పుడే అంగవైకల్యం బారిన పడ్డాడు. చేతులు కదపలేడు. అడుగులు తడబడేవి. అయినా అతడి ఆశయం ఎప్పుడూ పరుగులు పెడుతూనే ఉండేది. ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు వైజాగ్‌లో చదివాడు. అదే ఉత్సాహంతో ఎం.కాం. చదవడానికి భీమవరం వచ్చాడు. ఈ మధ్యలో ఎన్నో ఆటుపోట్లు. సాటి విద్యార్థుల సూటిపోటి మాటలు. కష్టపడి చదివినా సొంతంగా పరీక్ష రాయలేని నిస్సహాయత. వేరొకరిపై ఆధారపడాల్సిందే. ఈ విషయం ఆలోచించినప్పుడల్లా అతడిలో పట్టుదల పెరిగేది. 'నేనే సొంతంగా ఎందుకు రాయొద్దు?' అని ప్రశ్నించుకున్నాడోసారి. కాళ్లతోనే రాస్తూ సాధన మొదలు పెట్టాడు. మొదట్లో కష్టంగా ఉండేది. అయినా ఇష్టపడ్డాడు కదా! తొందర్లోనే పట్టు దొరికింది. ఇంటర్లో ఒకట్రెండు పరీక్షలు సొంతంగా రాశాడు. పీజీలో మాత్రం అన్ని పరీక్షలు కాళ్లతోనే రాశాడు. రాష్ట్రం దృష్టిని ఆకర్షించాడు. చదువుపై విపరీతమైన ప్రేమ కనబరిచే జగన్నాథం పీజీ వరకూ ఒక్కసారీ ఫెయిల్‌ కాలేదు. 'నేనూ నీలా బొమ్మలేస్తా'నని ఓ మిత్రుడితో పందెం కాసి చిన్నప్పుడే సాధన మొదలు పెట్టాడు. అదీ కాళ్లతోనే. మెల్లిమెల్లిగా వేసిన బొమ్మల్ని పోటీలకు పంపాడు. ముందు మెచ్చుకోలు.. ఆపై బహుమతులొచ్చాయి. అలా జగన్నాథం ఇప్పటికి యాభైకి పైగా బహుమతులు గెల్చుకున్నాడు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు